అమ్మ, నాన్న, పెద్దలందరూ : నల్ల జాతి వాళ్ళ ప్రాణాలు మనందరికీ ముఖ్యం

Letters For Black Lives
Letters for Black Lives
3 min readJul 11, 2016

--

This is the Telugu version of the open letter created by Letters for Black Lives, an ongoing project for people to create and translate resources on anti-Blackness for their communities in solidarity with #BlackLivesMatter. The letter was written and translated collaboratively by hundreds of people who want to have honest and respectful conversations with their parents about an issue important to them.

అమ్మ, నాన్న, Uncle, Aunty, మరియు పెద్దలందరూ :

మనం ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి.

మీరు పెరిగిన రోజుల్లో, ఆ ఊళ్ళలో నల్ల జాతి వారు ఎక్కువ మంది లేకపోయుండవచ్చుగానీ మా జీవితాల్లో వాళ్ళది ముఖ్యమైన పాత్ర — వాళ్ళు మా స్నేహితులు, మా తోటి విద్యార్థులు, మా సహచరులు, మా సహోద్యోగులు, మా కుటుంబం. ఈనాడు, వాళ్ళ ప్రాణాల మీద మాకు భయం కలుగుతుంది.

ఈ సంవత్సరంలోనే అమెరికాలో పోలీసు 500 మంది పైన చంపేశారు. నల్ల జాతి వారు అమెరికా జనాభాలో 13% మాత్రమే కాని, పోలీసు చంపిన వారిలో 25% దాక ఉన్నారు. గత వారం, Louisianaలో Alton Sterling అనే నల్ల జాతి వ్యక్తి కేవలం వీధి పక్కన CDలు అమ్ముతుండగా ఇద్దరు తెల్ల జాతి పోలీసులు అతన్ని చంపేశారు. ఆ మరునాడే Minnesotaలో, ఒక పొలీసాయన Philando Castile అనే మరొక నల్ల జాతి వ్యక్తీని traffic stop మధ్యలో, అతని గర్ల్ ఫ్రెండూ, ఆమె నాలుగేళ్ళ కూతురూ పక్కన చూస్తూండగా, కాల్చి చంపేశాడు. ఇలాంటి హత్యలకు దాదాపు ఎప్పుడూ పోలీసులకు శిక్షలు ఏమీ పడవు.

ఈ భయంకరమైన వాస్తవాన్ని మా స్నేహితులు కొందరు ప్రతీ రోజూ ఎదుర్కోవాలి.

మనము అమెరికాలొ నల్ల జాతి వాళ్ళు ఎదుర్కొనే ఆపదల గురించి విన్నప్పుడల్లా, సానుభూతి చూపించే బదులు, ఈ వాస్తవం నుంచి మనల్ని మనం కాపాడుకోవటం కోసం మనకీ వాళ్ళకీ ఉన్న తేడాలు ఎత్తిచూపించడం మన అలవాటు. మీడియాలో నల్ల జాతి వారిని రౌడీలుగా, criminalsగా చూడటంవల్ల, పోలీసులు వారిని కాల్చినప్పుడు, మీరు అది నల్ల వాళ్ళ తప్పే అని అనుకోవచ్చు. ఏమీ లేకుండా అమెరికాకి వచ్చి, జాతి వివక్షతని ఎదుర్కొని మనకోసము మనమే మంచి జీవితాలను నిర్మించుకున్నప్పుడు, వాళ్ళెందుకు అలాగే చేయలేరు అని మీరు అడగవచ్చు.

మీతో మా ఆలోచనలను పంచుకోవాలనుంది.

ఈ దేశంలో మన Asian జాతిపట్ల పక్షపాతం ఎదురుకోవడం అనే విషయం నిజమే. కొంతమంది మనం మాట్లాడే విధానం చూసి అవమానిస్తారు. కొన్ని సార్లు మనకి నాయకత్వ లక్షణాలు లేవు అని ఉద్యోగాల్లో ప్రమోషనులు ఇవ్వరు. మనలో కొంతమందిని “terrorists” అని కూడా పిలుస్తారు. కానీ చాలా వరకు మనము వీధిలో నడుస్తూ ఉంటే మనల్ని చూసి “dangerous criminal” అని అనుకోరు. సాధారణంగా పోలీసు మన పిల్లల్ని, పెద్దల్ని వాళ్ళు Asian అనే వట్టి కారణంతో చంపరు.

మా నల్ల జాతి స్నేహితుల పరిస్థితి ఇది కాదు. చాల మంది వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా అమెరికాకి బానిసలుగా తీసుకురాబడినారు. లాభాలకోసము శతాబ్దాలుగా వాళ్ళ సమాజాలు, కుటుంబాలు, శరీరాలు ఛిద్రము చేయబడ్డాయి. బానిసత్వం రద్దయ్యిన తరవాత కూడా వాళ్ళ జీవితాలని ప్రభుత్వ సహాయం లేకుండా వాళ్ళే పునర్నిర్మించుకోవలసి వచ్చింది. సొంతింటికి హక్కు లేకుండా, వోటుకు హక్కు లేకుండా, హింస గురించి నిరంతరం భయపడాల్సి వచ్చింది. ఆ భయము వాళ్ళకి ఇప్పటికీ ఉంది.

నల్ల జాతి ఉద్యమకారులు వారి హక్కులకోసము పోరాడుతూ, వాళ్ళకేకాకుండా మన Asian జాతి వారి కోసము కూడా అమెరికాలో ఎక్కువ అవకాశాలకోసము ఉద్యమాలు చేశారు. ఈనాడు మనందరికీ ఉండే అవకాశాలన్నిటి కోసము నల్ల జాతి ఉద్యమకారులు ఎంతో మంది దెబ్బలు తిన్నారు, జైలుకి వెళ్లారు, మరియు ప్రాణాలు ఇచ్చారు. మనము వారికి ఎంతో రుణపడి ఉన్నాము. ఇది వారికీ మనకీ మధ్య పోటీ కాదు; మనము అందరము ఒకే అన్యాయపు వ్యవస్థతో పోరాడుతున్నాము.

ప్రజలని కాపాడటానికి ప్రమాణం చేసిన ఒక రక్షకుడు, ఒక అమాయకుడిని కాల్చినప్పుడు ఆ రక్షకుడు మనందరిమీద దాడి చేసినట్టే. ఆ అమాయకుడి జీవితముతోపాటు, సమానత్వం మీద మనందరికుండే నమ్మకము కూడా కాల్చేసినట్టే.

ఈ కారణాలన్నిటివలన మేము “Black Lives Matter” అనే ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాము. నల్ల జాతి వారిని ఎవరైనా అవమానిస్తే, మేము దాన్ని వ్యతిరేకిస్తాము — ఆ అవమానించింది బయటవాళ్ళయినా, లేక మా బంధువులైనా సరే. మాకు మీమీదుండే ప్రేమవల్ల ఈ మాట మీతో చెబుతున్నాము. ఈ విషయములో మన మధ్య సంఘర్షణ లేకుండా ఉండాలని కోరుకుంటున్నాము. పోలీసుల హింసకి గురి అయిన వారి తల్లితండ్రులకు, పిల్లలకు మనము అందరము సానుభూతి చూపించాలని ఆశిస్తున్నాము. మీరు మా దుఃఖము, కోపము అర్ధముచేసుకుంటారని, మేము నిరసన ఉద్యమంలో పాల్గుంటే మీ మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాము. చివరికి, ఈ ఉత్తరాన్ని మీ స్నేహితులకు, బంధువులకు పంపమని అడుగుతున్నాము.

మీరు ఈ దేశానికి కష్టపడి వచ్చినందుకు, అన్యాయాలు జరిగినా బ్రతుకు కొనసాగించినందుకు, మీ పిల్లలుగా మేము గర్విస్తున్నాము. మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు పడిన కష్టాలు మేమెప్పుడూ పడకుడదని మీరు ఈ దేశములో చాలా ఇబ్బంది పడ్డారు, చాలా త్యాగాలు చేశారు. ఇదంతా మేము పైకిరావాలని చేశారు — మన American Dream కోసము చేశారు.

కానీ ఆ American Dream కేవలం మీ పిల్లల కోసం మాత్రమే కాదని మీరు కూడ ఒప్పుకుంటారని మేం ఆశిస్తున్నాం. ఏ జాతైనా, మనము అందరము ఒకే పరిస్థితిలో ఉన్నాము. మనము సురక్షితంగా ఉండాలంటే, మనందరి స్నేహితులు, బంధువులు, పొరుగింటివాళ్ళు కూడా ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలి. భవిష్యత్తులో అమెరికాలో ఉండే అన్ని జాతుల వాళ్ళు పోలీసులు హింసిస్తారని భయపడకుండా జీవించాలని మా ఆశ. మీక్కూడా ఇదే ఆశ ఉంటుందని మేము ఆశిస్తున్నాము.

ప్రేమతో, ఆశతో,

మీ పిల్లలు

“Letters for Black Lives” అనే projectలోభాగంగా ఈ ఉత్తరాన్ని తెలుగులోకి మేము అనువదించాము. మన స్నేహితులకు, బంధువులకు నల్ల జాతి వాళ్ళు రోజు బ్రతికే అన్యాయపు వ్యవస్థము గురించి, #BlackLivesMatter అనే ఉద్యమాన్ని గురించి తెలుసుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాము. ఈ ముఖ్యమైన విషయము గురించి మా పెద్దలతో ఎంతో మర్యాదగా మాట్లాడాలనే ఆశతో ఈ ఉత్తరాన్ని కొన్ని వందల మందిమి కలిసి వ్రాసాము.

Translators

Hema Karunakaram

Samata Katta

Swati Rayasam

Anand Kuchibotla

Subhodaya Aduru

Gautham Reddy

Sravanthi Kollu

--

--